‘మృగరాజు’ డిజాస్టర్ అవ్వడంలో కీలక పాత్ర పోషించిన ‘అడవిరాజు’!
on Nov 12, 2024
సినిమా ఇండస్ట్రీలో ఏ నిర్మాతైనా అందరు హీరోలతో సినిమాలు నిర్మించాలనుకుంటారు. కానీ, భారీ చిత్రాల నిర్మాత దేవివరప్రసాద్ మాత్రం దీనికి పూర్తి విరుద్ధం. నిర్మాతగా ఆయన కెరీర్‌ను ఎన్.టి.రామారావుతో ప్రారంభించారు. ఆ తర్వాత వరసగా చిరంజీవితోనే సినిమాలు చేశారు. నందమూరి బాలకృష్ణతో ఒక్క సినిమా మాత్రమే చేశారు. మెగాస్టార్ చిరంజీవితో దేవివరప్రసాద్ 6 సినిమాలు నిర్మించారు. వాటిలో కొన్ని సూపర్‌హిట్ అయ్యాయి, మరికొన్ని బ్లాక్‌బస్టర్స్ అయ్యాయి. కానీ, ఒకే ఒక్క సినిమా భారీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఆ సినిమా ఆయన్ని కోలుకోలేని దెబ్బతీసింది. ఆ సినిమా పేరు ‘మృగరాజు’. 2001లో విడుదలైన ఈ సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది. అంతటి సక్సెస్‌ఫుల్ నిర్మాత ఒక్క సినిమాతో భారీగా నష్టపోవడానికి, ఆ సినిమా డిజాస్టర్ కావడానికి కారణాలు ఏమిటి అనేది తెలుసుకుందాం.
1996లో హాలీవుడ్‌లో విడుదలైన ‘ది ఘోస్ట్ అండ్ ది డార్క్‌నెస్’ చిత్రం ఘనవిజయం సాధించింది. నిర్మాత దేవీవరప్రసాద్‌కి జయంత్ ఒక సినిమా చెయ్యాల్సి ఉంది.
‘ది ఘోస్ట్ అండ్ ది డార్క్‌నెస్’ తెలుగులో రీమేక్ చెయ్యాలని జయంత్ సి. పరాన్జీ అనుకున్నారు. కానీ, నాగార్జునతో ‘రావోయి చందమామ’ చిత్రం చెయ్యాల్సి వచ్చింది. అదే సమయంలో నిర్మాతకు గుణశేఖర్ ఒక కథ చెప్పారు. కానీ, అది ఆయనకు నచ్చలేదు. అలాగే చిరంజీవికి కూడా ఆ కథ నచ్చలేదు. అప్పుడు ఆ హాలీవుడ్ సినిమానే చెయ్యాలని డిసైడ్ అయ్యారు. కథను తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చారు. దక్షిణాఫ్రికాలో షూటింగ్ చెయ్యాలని డిసైడ్ అయ్యారు. ఈ సినిమాలో చిరంజీవి హంటర్‌గా, గైడ్‌గా కనిపిస్తారు. ఫారెస్ట్ నేపథ్యంలో సాగే ఈ కథలో సింహం ప్రధాన పాత్ర పోషించింది. దక్షిణాఫ్రికాలోని ఓ సర్కస్ కంపెనీ నుంచి జాక్ అనే సింహాన్ని తెప్పించారు. అంతకుముందు ఆ సింహం పలు హాలీవుడ్ సినిమాల్లో నటించింది. ఈ సినిమా కోసం 26 రోజులపాటు ఆ సింహం నటించింది. దాని పారితోషికం రూ.67 లక్షలు.
ఈ సినిమా బడ్జెట్ రూ.15 కోట్లు. ఆరోజుల్లో ఇది చాలా ఎక్కువ. దేవీవరప్రసాద్ పేరుకు నిర్మాత అయినా ఈ సినిమాకి సంబంధించిన ఎన్నో విషయాలు ఆయన ప్రమేయం లేకుండానే జరిగిపోయాయి. డబ్బులు నీళ్ళలా ఖర్చయిపోయాయి. బడ్జెట్ అనుకున్న దాని కన్నా చాలా ఎక్కువ అయింది. సింహంతో షూటింగ్ కాబట్టి ఫిల్మ్ కూడా చాలా ఎక్స్‌పోజ్ అయింది. సింహానికి ట్రైనింగ్ ఉన్నప్పటికీ దానితో షూటింగ్ చేసే సమయంలో యూనిట్ సభ్యులు ఎంతో భయపడిపోయేవారు. సింహానికి అనుగుణంగా నడుచుకుంటూ తనకు కావాల్సిన ఔట్‌పుట్ రాబట్టుకున్నారు గుణశేఖర్. ఈ సినిమా కోసం చిరంజీవి 150 రోజులు పనిచేశారు. సిమ్రాన్ 65 రోజులు షూటింగ్‌లో పాల్గొంది. ఈ సినిమాలోని రంభ, సంఘవి సాంగ్స్ కోసం విపరీతంగా ఖర్చుపెట్టారు. షూటింగ్ ఎంతో ఆలస్యమైనప్పటికీ మొత్తానికి సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారు.
నిజానికి ఈ సినిమాను సమ్మర్‌లో రిలీజ్ చెయ్యాలనుకున్నారు. సమ్మర్ కంటే సంక్రాంతి సీజన్ అయితే బాగుంటుంది అనుకున్నారు నిర్మాత. దానికి తగ్గట్టుగానే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ని స్పీడప్ చేశారు గుణశేఖర్. ఈ వర్క్ నాలుగైదు చోట్ల జరుగుతుండడంతో అన్నీ చూసుకోవడం గుణశేఖర్‌కి కష్టమైపోయింది. ఎంతో కష్టం మీద జనవరి 11న సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలోనే హాలీవుడ్ మూవీ ‘ది ఘోస్ట్ ఆఫ్ ది డార్క్‌నెస్’ చిత్రాన్ని ఒక డబ్బింగ్ చిత్రాల నిర్మాత ‘అడవిరాజు’ పేరుతో తెలుగులో రిలీజ్ చెయ్యడానికి సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని ముందుగా ప్రకటించకుండా ‘మృగరాజు’ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయగానే అదే డేట్‌కి తమ సినిమాను కూడా రిలీజ్ చేస్తున్నామని ఎనౌన్స్ చేశారు. దీంతో ‘మృగరాజు’ దర్శకనిర్మాతలు షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ డబ్బింగ్ సినిమా రిలీజ్ అయితే తప్పకుండా ‘మృగరాజు’పై ఎఫెక్ట్ పడుతుంది. ఆ సినిమా రిలీజ్ అవ్వకుండా ఆపేందుకు నిర్మాత మరింత డబ్బు వెచ్చించాల్సి వచ్చింది. ‘అడవిరాజు’ చిత్రం వల్ల ‘మృగరాజు’ చిత్రానికి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.
తెలుగు సినిమాలకు సంక్రాంతి సీజన్ ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలిసిందే. 2001 సంక్రాంతి సీజన్‌లో మృగరాజు, నరసింహనాయుడు, దేవీపుత్రుడు చిత్రాలు విడుదలయ్యాయి. విశేషం ఏమిటంటే ఈ మూడు సినిమాలకూ మణిశర్మ సంగీత దర్శకుడు. మృగరాజు చిత్రానికి ఓపెనింగ్స్ భారీగానే వచ్చినా కథాబలం లేకపోవడం వల్ల రన్ రాలేదు. దాంతో సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా కొన్న బయ్యర్లు తీవ్రంగా నష్టపోయారు. 1975 నుంచి 2001 వరకు ఎన్నో భారీ విజయాల్ని అందుకున్న దేవీవరప్రసాద్ ఒక్క సినిమాతో తెరమరుగైపోయారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో కూడా ఇది ఓ పెద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది.